సోషల్ మీడియా వాడకం పట్ల అప్రమత్తత అవసరం- అమ్మాయిలు జర భద్రం : హైదరాబాద్ సీపీ
Published : Nov 11, 2023, 7:07 PM IST
Hyderabad CP Sandeep Shandilya Alert Women :సామాజిక మాధ్యమాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలని.. గుర్తు తెలియని వ్యక్తులు పంపించే ఫ్రెండ్ రిక్వెస్ట్‌ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించొద్దని హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య హెచ్చరించారు. ఇటీవల ఇద్దరు యువతుల వీడియోలు నగ్నంగా మార్చినట్లు ఫిర్యాదులు వచ్చాయని.. ఆ రెండు ఘటనల్లోనూ సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమైన యువకులే ఈ నేరానికి పాల్పడినట్లు సందీప్ శాండిల్య వెల్లడించారు. ఫేస్బుక్ స్నేహాన్ని అలుసుగా తీసుకొని వీడియో కాల్స్ మాట్లాడిన తర్వాత.. సదరు బాధితురాలి వీడియోను మార్ఫింగ్ చేసి నగ్నంగా మార్చినట్లు దర్యాప్తులో తేలిందని సీపీ తెలిపారు.
ఆ వీడియోలను యువతికి చూపించి బెదిరించి లైంగిక వాంఛ తీర్చుకున్నాడని.. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా సామాజిక మాధ్యమాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీపీ సూచించారు. ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని.. బాధితుల వివరాలు గోప్యంగా ఉంచి.. వాళ్లకు తగిన న్యాయం చేసే బాధ్యత తనదేనని సీపీ సందీప్ శాండిల్య తెలిపారు. పోలీసులను సోదరులుగా భావించి సమస్యను చెప్పుకోవాలని సీపీ సూచించారు.