ఉత్తమ్ వర్సెస్ సైదిరెడ్డి - హుజూర్‌నగర్‌లో కిడ్నాప్ డ్రామా - అసలేం జరిగింది?
Published : Nov 22, 2023, 1:42 PM IST
Huzurnagar Latest Politics in Huzurnagar :సూర్యాపేట జిల్లాలోని హుజూర్నగర్ నియోజకవర్గంలో పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికలను నిర్వహించే ప్రతినిధులను ఎమ్మెల్యే సైదిరెడ్డి బలవంతంగా కిడ్నాప్ చేశారని పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. విజయవాడకు చెందిన చాణక్య అనే సంస్థకు హుజూర్ నగర్ నియోజకవర్గంలో తన ఎన్నికలను నిర్వహించేందుకు బాధ్యతలు అప్పగించామని తెలిపారు.
వారిని ఎమ్మెల్యే సైదిరెడ్డి బలవంతంగా కారులో ఎక్కించుకొని తనకు అనుకూలంగా పనిచేయాలని బెదిరించారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయం సీఐకి తెలుసని, సీఐ ఎమ్మెల్యేకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఉత్తమ్ అన్నారు. తమకు పోలీస్ వ్యవస్థపై నమ్మకం లేదని తెలిపారు. ఈ విషయంపై ఎన్నికల అధికారికి పిర్యాదు చేస్తామని వెల్లడించారు. ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.
Saidireddy Reacts To Uttam Kumar Reddy Comments: ఉత్తమ్ కుమార్‌రెడ్డి తనపై చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే సైదిరెడ్డి స్పందించారు. ఉత్తమ్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉత్తమ్‌కు ఓడిపోతాననే భయం పట్టుకుందని అందుకే ఇలా ప్రవర్తిస్తున్నారని అన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని ఉత్తమ్‌కు సైదిరెడ్డి సూచించారు.