Hyderabad Car Accident Today Video : ట్యాంక్‌బండ్ వద్ద కారు బీభత్సం.. కొద్దిలో ఎంత ప్రమాదం తప్పిందో! - ట్యాంక్ బండ్ వద్ద రోడ్డు ప్రమాదం
Car Accident at Hussain Sagar Hyderabad :భాగ్యనగరంలో రోజురోజుకూ ఆకతాయిల ఆగడాలు మితిమీరుతున్నాయి. ముఖ్యంగా కొందరు ఆకతాయిలు బైకులు, కార్లపై విన్యాసాలు చేస్తూ ఇతరుల ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. మరికొందరు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ప్రాణాలు పొట్టన పెట్టుకుంటున్నారు. ఇలాంటి వారి ఆట కట్టించడానికి పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం లేకుండాపోతోంది. రాష్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా ప్రయాణించిన వారికి, సీటు బెల్ట్ ధరించని వారికి ఫైన్‌లు విధించి, వారిపై చర్యలు తీసుకుంటున్నా ఎలాంటి ఉపయోగం లేకుండాపోతోంది. పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదాల దృష్ట్యా పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు ట్రాఫిక్ నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చినా ప్రమాదాలకు అడ్డుకట్ట మాత్రం వేయలేకపోతున్నారు.
తాజాగా హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి హుస్సేన్ సాగర్‌లోకి దూసుకెళ్లింది. ట్యాంక్ బండ్ వద్ద ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన డ్రిల్స్, చెట్టును బలంగా ఢీకొని ఆగిపోయింది. కారులోని బెలూన్స్ బయటకు రావడంతో.. ఎవరికీ గాయాలు కాకుండా పెను ప్రమాదం తప్పింది. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు కారును వదలి పరారయ్యారు. నిందితులు గుంటూరుకు చెందిన షేక్ కరీం, మాదాపూర్ నివాసిగా సైఫాబాద్ పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.