నీట మునిగిన వందలాది ఓలా కార్లు.. తగ్గని యమున ఉగ్రరూపం - వైరల్ వీడియోలు
Cars Stuck In Water : యమునా నది ఉగ్రరూపంతో దిల్లీ సహా సమీప ప్రాంతాలు జల దిగ్బంధంలోనే చిక్కుకుపోయాయి. అనేక లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో కూరుకుపోయాయి. దీంతో సహాయ, పునరావాస చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. యమునా ఉపనది హిండన్ నదికి వరద ప్రవాహం భారీగా పెరిగింది. తద్వారా సమీప ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. ఉత్తర్ప్రదేశ్ నోయిడాలోని ఎకోటెక్ 3 సమీప ప్రాంతమంతా పూర్తిగా నీట మునిగింది.
ఇదే ప్రాంతంలో ఉన్న ఓలా కంపెనీ డంప్ యార్డ్ సైతం పూర్తిగా నీటిలో కూరుకుపోయింది. పాత, రీపేర్ అయిన కార్లను కంపెనీ ఇక్కడ నిల్వ చేస్తోంది. ప్రస్తుతం ఆ కార్లన్ని వరద నీటిలో మునిగిపోయాయి. ఓలా కంపెనీని ముందే హెచ్చరించి రెండు సార్లు నోటీసులు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయిన ఓలా స్పందించలేదని వారు వెల్లడించారు. పరిసర ప్రాంత గ్రామ ప్రజలను మాత్రం ముందస్తుగానే ఇళ్లు ఖాళీ చేయించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ భారీ వరదల కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వారు వివరించారు. అదే విధంగా హిండెన్ నది పరివాహక ప్రాంతం ప్రజలను అప్రమత్తం చేశారు.