24వేల మంది విద్యార్థులతో 15కి.మీ మానవహారం- మోదీ కోసమే! - సూరత్ డైమండ్ కార్యాలయం
Published : Dec 15, 2023, 5:53 PM IST
Human Chain Formed By Students :గుజరాత్‌లోని సూరత్‌లో 24 వేల మంది విద్యార్థులతో 15 కి.మీ భారీ మానవహారం ట్రయల్ రన్‌ను శుక్రవారం విజయవంతగా నిర్వహించారు. ప్రపంచంలోనే అతిపెద్ద డైమండ్ మార్కెట్‌ను ప్రారంభించేందుకు డిసెంబర్ 17న మోదీ రానున్నారు. ఈ నేపథ్యంలో మోదీకి వినూత్నంగా స్వాగతం పలికేందుకు సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఈ మానవహారం కార్యక్రమం తలపెట్టారు.
సూరత్ నగరంలోని 30 బ్లాక్‌ల పరిధిలోని అన్ని కళాశాల, పాఠశాలకు చెందిన 24 వేల విద్యార్థులను ఈ మానవహారం ట్రయల్‌రన్ కార్యక్రమంలో భాగంచేశారు. శుక్రవారం పోలీస్ గ్రౌండ్ నుంచి జోగాని మాత ఆలయం వరకు విద్యార్థులతో పదిహేను కిలోమీటర్ల మేర మానవహారం నిర్వహించారు నగరపాలక అధికారులు. స్వచ్ఛతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని వారు వెల్లడించారు. విద్యార్థులంతా మానవహారంగా ఏర్పడి స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేశారని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ హోం మంత్రితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.