రాష్ట్రంలో వరుస సెలవులు - పుణ్యక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు
Published : Dec 24, 2023, 1:52 PM IST
Huge rush At Yadadri Bhadradri Temples : వరుసగా మూడ్రోజులు సెలవులు రావడంతో ప్రజలు పుణ్యక్షేత్రాలు బాట పడుతున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ప్రసిద్ధ క్షేత్రాలైన యాదాద్రి, భద్రాద్రిలకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. కుటుంబ సభ్యులతో స్వామి వారిని సందర్శించుకుంటున్నారు. భక్తుల రాకతో ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి.
Huge rush At Bhadradri Temple :భద్రాద్రి రామయ్య సన్నిధిలో భక్తుల రద్దీ పెరిగింది. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు రావడంతో ఆలయ ప్రాంతాలన్నీ కిటకిటలాడుతున్నాయి. ఆదివారం కావడంతో స్వామివారికి విశేష అభిషేకం నిర్వహించారు. ప్రత్యేక దర్శనానికి రెండు గంటలు, ఉచిత దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా నిలిపివేసిన నిత్య కల్యాణాలు ఈరోజు నుంచి పునఃప్రారంభమయ్యాయి.
Huge Rush At Yadadri Temple :యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. క్రిస్మస్ సందర్భంగా వరుస సెలవులు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు బారులు తీరారు. ఆలయ పరిసరాలన్నీ కోలాహలంగా మారాయి. స్వామివారి ఉచిత దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతోంది. భక్తులు అధికంగా రావడంతో ప్రసాద విక్రయ శాల, విష్ణు పుష్కరిణి, పార్కింగ్ ఘాట్లు, బస్టాండ్ ఆవరణాల్లో సందడి నెలకొంది.