Huge Box Found at Vizag Beach: విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన బ్రిటీష్ కాలం నాటి భారీ చెక్క పెట్టె.. పగలగొట్టి చూస్తే - విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన పురాతన పెట్టె
Published : Sep 30, 2023, 12:09 PM IST
|Updated : Sep 30, 2023, 4:15 PM IST
Huge Box Found at Vizag Beach :విశాఖపట్నం తీరానికి ఓ భారీ పెట్టె కొట్టుకు వచ్చింది. దీని బరువు సుమారు వంద టన్నుల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పురాతనమైన చెక్క పెట్టె కావడంతో (Wooden Box Wash up on Vizag Beach) ప్రొక్లెనర్ సహాయంతో ఒడ్డుకు చేర్చారు పోలీసులు. బీచ్‌లో ఉన్న సందర్శకులు ఆ భారీ పెట్టెను చూసేందుకు ఎగబడ్డారు. దీంతో వారిని కట్టడి చేయడానికి పోలీసులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది. మరో వైపు వైఎంసీఏ బీచ్‌కు కొట్టుకు వచ్చిన ఈ భారీ ఆకృతిలోని చెక్క పెట్టె బ్రిటీష్ కాలం నాటిదిగా అంచనా వేస్తున్నారు అధికారులు. పురాతన పెట్టెపై ఆర్కియాలజీ విభాగానికి సమాచారం ఇచ్చారు. అయితే ఆ పెట్టెలో ఏముందనేది స్థానికుల్లో తీవ్ర ఉత్కంఠను రేపింది. గతంలోనూ విశాఖ తీరానికి కొన్ని వస్తువులు కొట్టుకు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే, ఇప్పుడు వచ్చిన చెక్క పెట్టెపై ఊహాగానాలు మిన్నంటడంతో..అధికారులు అప్రమత్తమైయ్యారు.
తీవ్ర ఉత్కంఠ నడుమ విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన చెక్కెపెట్టెను రెండు ప్రొక్లైనర్లతో సాయంతో అధికారుల సమక్షంలో విరగొట్టారు. బాంబ్ స్క్వాడ్ టీం అధికారులు కూడా ఈ బాక్సును బద్దల కొట్టే ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ క్రమంలో చాలా జాగ్రత్తగా చెక్కపెట్టను ముక్కలు చేయగా.. బాక్సులో ఎలాంటి హానికర పదార్థాలు లభ్యం కాలేదు. దీంతో జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. ఓడలను సముద్రంలో లంగరు వేసి నిలిపేందుకు ఉపయోగించే చెక్కల అమరికగా గుర్తించారు. ఉదయం నుంచి భారీ పెట్టె ఒడ్డుకు కొట్టు కొచ్చిందంటూ సామాజిక మధ్యమలలో వైరల్ కావడంతో సందర్శకులు, స్థానికులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.