అయోధ్య రాముడి కోసం అమెరికాలో కార్ ర్యాలీ - విశ్వహిందు పరిషత్ అమెరికా
By PTI
Published : Dec 17, 2023, 10:00 AM IST
|Updated : Dec 17, 2023, 10:24 AM IST
Hindu Americans Car Rally Washington DC :అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో హిందూ సంఘ సభ్యులు కార్ ర్యాలీ నిర్వహించారు. అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ర్యాలీని శనివారం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఫ్రెడరిక్ సిటీ సమీపంలోని అయోధ్య వేలో ఉన్న శ్రీ భక్త ఆంజనేయ ఆలయం వద్దకు చేరుకుని ఈ ర్యాలీ చేశామని వెల్లడించారు. ఈ సందర్భంగా అమెరికా విశ్వహిందు పరిషత్ డీసీ చాప్టర్ అధ్యక్షుడు మహేంద్ర మాట్లాడారు.
''హిందువుల 500 సంవత్సరాల పోరాటం తర్వాత శ్రీరామ మందిరాన్ని ప్రారంభిస్తున్నారు. కాబట్టి మేము వచ్చే ఏడాది జనవరి 20న వాషింగ్టన్ డీసీ ప్రాంతంలో సుమారు 1,000 అమెరికన్ హిందూ కుటుంబాలతో ఒక చారిత్రక వేడుకను నిర్వహిస్తున్నాం. ఈ వేడుకలో రామ్ లీలా, శ్రీరాముని కథలు, శ్రీరామునికి హిందూ ప్రార్థనలు, రాముడు, ఆయన కుటుంబ సభ్యులకు భజనలు (భక్తి గీతాలు) ఉంటాయి. ఈ వేడుకలో అమెరికాలో పుట్టిన పిల్లలకు శ్రీరాముడి జీవితం గురించి అర్థమయ్యే రీతిలో దాదాపు 45 నిమిషాల పాటు ప్రదర్శన ఉంటుంది" అని మహేంద్ర సాపా తెలిపారు.
ఈ ర్యాలీ సహ నిర్వాహకుడు, స్థానిక తమిళ హిందూ నాయకుడు ప్రేమ్‌కుమార్ స్వామినాథన్ తమిళ్లో శ్రీరాముడిని స్తుతిస్తూ పాటలు పాడారు. వచ్చే ఏడాది వాషింగ్టన్లో జరగబోయే వేడుకకు అక్కడికి వచ్చిన వారిని ఆహ్వానించారు. రాబోయే హిందూ తరాలకు, ఇప్పుడు ఉన్న కుటుంబాలు అమెరికన్ సంస్కృతికి నమూనాగా మారడానికి అయోధ్య రామమందిరం చారిత్రక ప్రారంభోత్సవాన్ని గుర్తుంచుకోవడం ఎంత ముఖ్యమో అనే విషయాన్ని మరో హిందూ నాయకుడు అంకుర్ మిశ్ర వివరించారు. అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరాన్ని 2024 జనవరి 22వ తేదీన ఘనంగా ప్రారంభించనున్నారు.