Himayat Sagar gates lifted : నిండుకుండలా హిమాయత్ సాగర్.. 2 గేట్లు ఎత్తిన అధికారులు - హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తివేత
Himayat Sagar gates lifted : వరుసగా 3 రోజుల నుంచి కురుస్తున్న భారీవర్షాలతో హైదరాబాద్ జంట జలాశయాల్లోకి వరద ప్రవాహం పెరిగింది. రాత్రి నుంచి వస్తున్న వరదతో హిమాయత్ సాగర్ నిండుకుండలా మారింది. ఎగువ నుంచి ఇంకా ప్రవాహం వస్తుందన్న సమాచారంతో.. అధికారులు జలాశయం గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. సాయంత్రం 4 గంటలకు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, జలమండలి అధికారులు.. హిమాయత్ సాగర్ 2 గేట్లను ఒక్కో ఫీటు వరకు ఎత్తి వరద నీటిని మూసీ నదిలోకి విడుదల చేశారు. ప్రస్తుతం హిమాయత్ సాగర్‌కు 1200 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగా.. రెండు గేట్లను ఎత్తి 700 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. రిజర్వాయర్ మొత్తం సామర్థ్యం 3.9 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 2.760 టీఎంసీలు ఉంది. హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటి స్థాయి 1762.75 అడుగులుగా ఉంది. జలాశయం గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసినందువల్ల.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిపాలనా యంత్రాంగాలు, జీహెచ్ఎంసీ సిబ్బంది, పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని జలమండలి ఎండీ దానకిశోర్ ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.