హిమాచల్‌లో భారీ వర్షాలు.. కొండచరియలు విరిగిపడి రాకపోకలు బంద్.. లోయలో బస్సు బోల్తా.. - హిమాచల్ ప్రదేశ్ విరిగిపడని కొండచరియల అప్డేట్
Himachal Pradesh Landslide :హిమాచల్ ప్రదేశ్‌ను వర్షాలు, వరదలు వణికిస్తూనే ఉన్నాయి. భారీ వర్షాలకు పలు చోట్ల కొండ చరియలు విరిగిపడి.. జాతీయ రహదారులపై రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. మండి జిల్లాలో వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక ఇళ్లను వరద నీరు చుట్టుముట్టింది. బిలాస్‌పుర్ జిల్లాలోనూ కొండచరియలు విరిగిపడుతూనే ఉన్నాయి. కొండపై నుంచి మట్టి, రాళ్లు దొర్లిపడి రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని బిలాస్‌పుర్ జిల్లా యంత్రాంగం తెలిపింది.
మరోవైపు మండి నుంచి షిమ్లా వెళుతున్న హిమాచల్ ప్రదేశ్ ఆర్టీసీ బస్సు.. లోయలో పడి నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మరో 8 మందికి స్వల్ప గాయాలయ్యాయి. మండి జిల్లాలో కురుస్తున్న వర్షాలకు రోడ్డులో కొంత భాగం మొత్తం కుంగిపోగా.. అదేమార్గంలో వెళుతున్న ఆర్టీసీ బస్సు పక్కనే ఉన్న లోయలోకి జారిపోయింది. క్షతగాత్రులను.. స్థానిక ఆసుపత్రులకు తరలించారు. సొలన్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి షిమ్లా-కల్కా మార్గంలో జాతీయ రహదారి 5ను మూసివేశారు. మరమ్మతుల అనంతరం గురువారమ ఈ మార్గాన్ని తెరవగా.. శుక్రవారం కొండచరియలు మళ్లీ విరిగిపడి మూసివేయాల్సి వచ్చింది.