హిమాచల్లో ఆగని వరద విలయం.. 53కు మృతుల సంఖ్య.. శివాలయం శిథిలాల కిందే మరో 10 మంది - himachal pradesh flood today
Himachal Pradesh Flood Video :హిమాచల్ ప్రదేశ్‌లో వరద బీభత్సం కొనసాగుతూనే ఉంది. మండీలో బియాస్ నది నీటి మట్టం పెరిగింది. దీంతో మండీ బస్టాండ్ ముంపునకు గురైంది. ప్లాట్‌ఫ్లామ్‌ల వరకు వాన నీరు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించిన ఘటనల్లో మృతుల సంఖ్య 53కు పెరిగింది. శిమ్లాలోని సమ్మర్‌హిల్, ఫాగ్లీలో కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో మృతుల సంఖ్య 19కు పెరిగింది. సమ్మర్‌హిల్ ప్రాంతంలోని శివాలయంపై కొండచరియలు విరిగిపడిన ఘటనలో మరో రెండు మృతదేహాలను వెలికి తీశారు. మరో పది మంది ఇంకా శిథిలాల కిందే చిక్కుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయ చర్యలు కొనసాగిస్తున్నాయి.
Himachal Pradesh Floods 2023 :శిమ్లాలో పలు చోట్ల భారీ వృక్షాలు రహదారికి అడ్డంగా పడటం వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షాలు, వరద నేపథ్యంలో ఆగస్టు 19 వరకు హిమాచల్ ప్రదేశ్ విశ్వవిద్యాలయం అన్ని కార్యకలాపాలు నిలిపివేసింది. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన శిమ్లా-కల్కా రైల్వే లైను పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. కొండచరియలు విరిగిపడి.. ఈ రైల్వే లైనులో కొంతభాగం కొట్టుకుపోయి పట్టాలు వేలాడుతున్నాయి. ఈ రైల్వే లైను ఐదారు చోట్ల దెబ్బతిన్నట్లు అధికారులు వెల్లడించారు.