చుట్టూ వరదలు.. కొండల మధ్యలో బిక్కుబిక్కుమంటూ టూరిస్ట్‌లు.. టెన్షన్ టెన్షన్! - కసోల్ లేటెస్ట్ న్యూస్
Himachal Pradesh Flood News : గత కొద్ది రోజులుగా హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ధాటికి అనేక రోడ్లు ధ్వంసం కాగా.. కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ నేపథ్యంలో హిమాచల్‌లో పర్యటిస్తున్న టూరిస్ట్‌లు వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్నారు. సిమ్లా జిల్లాలోని కసోల్‌లో చిక్కుకున్న దాదాపు 100 మందికి పైగా పర్యటకులను అధికారులు రక్షించారు. వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించారు. వరద ఉద్ధృతికి అతలాకుతలమైన హిమాచల్ ప్రదేశ్‌లో ఇప్పటివరకు 80మంది వరకు చనిపోయారు. ఆస్తినష్టం కూడా భారీగా జరిగింది. దాదాపు రూ.4వేల కోట్ల వరకు ఆస్తినష్టం సంభవించినట్లు అధికారులు అంచనా వేశారు.
హిమాచల్‌లోని సిమ్లా-కిన్నౌర్ రహదారిపై కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రమాదవశాత్తు సట్లేజ్ నదిలో పడి గల్లంతయ్యారు. భారీ వర్షాల కారణంగా రహదారి దెబ్బతిన్న ప్రాంతంలో కారు అదుపుతప్పి నదిలోకి పడినట్లు అధికారులు తెలిపారు. గల్లంతైన వారిని సిమ్లాలోని నాంఖేరి మండలం లహదు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ప్రయాణికుల భద్రత కోసం రహదారి దెబ్బతిన్న అన్ని ప్రాంతాల్లో ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరారు. గల్లంతైన నలుగురి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.