Heavy Rains in Warangal : చెరువులా మారిన రోడ్లు.. 'వర్షం తగ్గాక కాలువలు నిర్మిస్తాం'
Warangal Floods at Market Center : వరంగల్ నగరం మరోసారి నీట మునిగింది గంటపాటు కురిసిన భారీ వర్షానికి నగరంలోని రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. పాత బీట్ బజార్ వద్ద కాలువలు చెత్తతో నిండిపోయాయి. రహదారిపై మురుగునీరు నిలిచిపోయినందున వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రోడ్డుకి ఇరువైపుల ఉన్న కొన్ని దుకాణాలు మురుగునీటితో నిండుకున్నాయి. చిన్నపాటి వర్షానికే పాత బీట్ బజార్తో పాటు బట్టల బజార్ ప్రాంతంలో పలు దుకాణాలు నీటి ముంపునకు గురవుతున్నారని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు వరంగల్ మహా నగర పాలక సంస్థ అధికారుల దృష్టికి తీసుకుపోయినా.. వారు పట్టించుకోలేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. మురుగునీరు దుకాణంలోకి చేరడంతో దుర్వాసన వస్తుందని అన్నారు. ఇప్పటికైనా అధికారులు మేలుకొని కాలువలను మరమ్మతు చేయాలని వేడుకున్నారు. వరద ముంపునకు గురైన పాత బీటు బజారుతో పాటు బట్టల బజార్ ప్రాంతాన్ని వరంగల్ మహా నగర పాలక సంస్థ మేయర్ గుండు సుధారాణి సందర్శించి.. దుకాణ యాజమానులకు భరోసా కల్పించారు. వర్షాలు తగ్గుముఖం పట్టగానే కాలువల నిర్మాణం చేస్తామని దుకాణదారులకు హామీ ఇచ్చారు.