బెంగళూరును ముంచెత్తిన వాన.. మిట్ట మధ్యాహ్నమే చీకటిగా మారిన గార్డెన్ సిటీ! - ఈరోజు కర్ణాటక బెంగళూరులో కుండపోత వర్షాలు
Bangalore Rains Today : కర్ణాటకలో పలుచోట్ల కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. బెంగళూరులో కురిసిన భారీ వర్షానికి రోడ్లు జలమయం అయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దట్టంగా మబ్బులు కమ్ముకోవటం వల్ల మిట్ట మధ్యాహ్నమే చీకటిగా మారింది. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. ఆయా చోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. హుబ్బళ్లిలోనూ వర్షాలు జోరుగా కురిశాయి. చిత్రదుర్గ, మంగళూరు, బెళగావి ప్రాంతాల్లో వాతావరణం చల్లబడింది. మరో మూడు రోజులు వానలు కురిసే అవకాశం ఉన్నట్లు బెంగళూరు వాతావరణ విభాగం తెలిపింది. కొన్ని రోజులుగా మంటమండిన ఎండలతో అల్లాడిపోయిన కన్నడిగులకు భారీ వర్షంతో ఉపశమనం కలిగింది.
సిద్ధరామయ్య అత్యవసర భేటీ
బెంగళూరు నగరాన్ని అకాల వర్షం అతలాకుతలం చేయడంపై వర్షాలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. అవసరమైతే అత్యవసర ప్రతిస్పందన దళాలను రంగంలోకి దించాలని సూచించారు.