Heavy Rains in Hyderabad : హైదరాబాద్‌లో భారీ వర్షం.. మరో రెండు రోజులు ఇలానే - ఈరోజు తెలంగాణలో భారీ వర్షాలు
Published : Sep 3, 2023, 11:43 AM IST
Heavy Rains in Hyderabad : ఆదివారం తెల్లవారుజాము నుంచి కురిసిన వర్షానికి హైదరాబాద్ మహా నగరం తడిసిముద్దయింది. దీంతో లోతట్టు ప్రాంతాలు, రహదారులు నీట మునిగాయి. రోడ్లపై నుంచి వర్షపు నీరు డ్రైనేజీతో పాటు ప్రవహించింది. నగరంలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్‌గూడ, కృష్ణానగర్‌లలో వర్షం కారణంగా రోడ్లు జలమయమై.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురైయ్యారు.
అలాగే పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. మరోవైపు బోరబండ, అల్లాపూర్, మోతీనగర్, రహమత్‌నగర్, సనత్ నగర్, అమీర్‌పేట్, మైత్రివనం ప్రాంతాల్లో వాన పడింది. ఉక్కపోతతో సతమతమవుతున్న భాగ్యనగర వాసులకు.. ఇలా వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఉపశమనం పొందారు.
కానీ భారీ వర్షం కురిస్తే మాత్రం మళ్లీ ఇళ్లలోకి నీరు చేరుతుందేమో అన్న భయంలో లోతట్టు ప్రాంతాల వాసులు ఉన్నారు. మరోవైపు సికింద్రాబాద్, కోఠి, బేగంబజార్, ఖైరతాబాద్, అబిడ్స్, నాంపల్లి, బషీర్‌బాగ్, నారాయణగూడ, హిమాయత్ నగర్, లక్డీకాపూల్, ట్యాంక్ బండ్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, కేపీహెచ్‌బీ ప్రాంతాల్లో వర్షం కురిసింది. రెండు రోజుల పాటు ఇలానే వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.