Heavy rain in Mahabubabad : ఉద్ధృతంగా భీముని పాదం జలపాతం.. సందర్శకులకు నో ఎంట్రీ - Heavy rains in Mahabubabad district
Rain effect in Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఏజెన్సీ గ్రామాల్లో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కుండపోత వర్షాల కారణంగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జిల్లాలోని కొత్తగూడ మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు నిండుకుండలా మారాయి. కొత్తపల్లి వైపు వెళ్లే బుర్కపల్లి వాగుపొంగడంతో రహదారిపై వాహనాలు నిలిచి రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. వేలుబెల్లి కతర్లవాగు సైతం పొంగిపొర్లుతుంది. నర్సంపేట నుంచి కొత్తగూడ వైపు వెళ్లే దారిలో గాదెవాగు గుంజేడుతోగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. మొండ్రాయిగూడెంలోను వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. కొత్తపల్లి మండలంలోని గాంధీనగర్‌లో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మోదె నరసమ్మ అనే వృద్ధురాలు ఇల్లు కూలిపోవడంతో ఆ కుటుంబం మెుత్తం నిరాశ్రయులు అయ్యారు. గూడూరు మండలం కొమ్ముల వంచ శివారులో భీముని పాదం జలపాతం భారీ వర్షాలకు ఉద్ధృతంగా జాలువారుతుంది. పర్యాటకులు జలపాత సందర్శనానికి రాకూడదని ఫారెస్ట్ అధికారుల హెచ్చరిక బోర్డులు పెట్టారు.