Rain in Hyderabad: హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం.. ఉరుములు, మెరుపులతో బీభత్సం - హైదరాబాద్‌లో వర్షాలు
Heavy rain in Hyderabad: ఉదయం బానుడి భగభగలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న హైదరాబాద్ నగర వాసులపై సాయంత్రం వేళ ఈదురు గాలుతో వరుణుడు విరుచుకుపడుతున్నాడు. ఒకే రోజులో భాగ్యనగర వాసులు విభిన్న వాతావరణం చూస్తున్నారు. ఇవాళ కూడా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టింది. నగరంలోని గచ్చిబౌలి, కొండాపూర్, రాయదుర్గంలో మెరుపులు, పిడుగులతో కూడిన వర్షం పడటంతో ప్రజలు భయందోళనకు గురైయ్యారు. నగరంలో కూకట్‌పల్లి, మూసాపేట్, ప్రగతినగర్, బాచుపల్లి, చందానగర్, మియాపూర్, బాలానగర్, సూరారం, శేరిలింగంపల్లి, పటాన్‌చెరు, అమీన్‌పూర్‌తో పాటుగా పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. కుత్బుల్లాపూర్లో వర్షం నీరు రోడ్డుపై ప్రవహించడంతో ట్రాఫిక్‌కు నిలిచిపోయింది. నాలాల్లో నీరు నదులను తలపిస్తోంది. పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో కూడా వర్షం దంచి కొట్టింది. బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్ బాగ్, లిబర్టీ, హిమాయత్ నగర్, లక్డీకాపుల్ లో తదితర ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపై వాన నీరుతో వాహనదారులు, బాటసారులు ఇబ్బందులు పడ్డారు. కొన్ని చోట్ల భారీ హోర్డింగ్‌లు నేలకొరిగాయి.