హిమాచల్‌లో వర్ష బీభత్సం.. పడవల్లా కొట్టుకుపోయిన లారీలు.. కూలిన వందేళ్ల వంతెన
Rains In Himachal Pradesh : దేశవ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలు చా లా ప్రాంతాల్లో ఆపార ఆస్తి నష్టాన్ని కలిగించాయి. ఆకస్మికంగా వరద పోటెత్తడం వల్ల భవనాలు, వాహనాలు కొట్టుకుపోయాయి. ఈ భారీ వర్షాలకు హిమాచల్ ప్రదేశ్‌లో నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. రావి, బియాస్, సట్లేజ్, స్వాన్, చీనాబ్‌తో సహా అన్ని ప్రధాన నదులు ఉప్పొంగుతున్నాయి. మండీ జిల్లా తునాగ్‌లో ఆకస్మిక వరదలు పోటెత్తడం వల్ల వాహనాలు కాగితపు పడవల్లా కొట్టుకుపోయాయి. కులులో లారీలు కూడా వరద ఉద్ధృతికి కొట్టుకుపోయాయి. భారీ రాళ్లు, పెద్దపెద్ద దుంగలు ఈ వరదలో కొట్టుకుపోయాయి. కులుమానాలీలో వరదల ధాటికి భారీ భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వందేళ్ల నాటి ఓ వంతెన సైతం కూలిపోయింది. సున్ని ప్రాంతంలో సట్లెజ్ నది ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోంది. వంతెనను తాకుతూ వరద ప్రవహిస్తుండడం వల్ల పరిసర ప్రాంతాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. మండీలోని పంచవక్ర్త ఆలయంలో నీటిలో మునిగిపోయింది. ప్రవాహం గంటగంటకూ పెరుగుతుండడం వల్ల స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. విక్టోరియా బ్రిడ్డీను తాకుతూ వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
జమ్ముకశ్మీర్‌లో కుండపోత వానలకు వరద పోటెత్తుతోంది. లేహ్‌లోని ఖరౌక్ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల ధాటికి.. 450 ఏళ్ల క్రితం నాటి పురాతన భవనం కుప్పకూలింది. గతంలో ఎన్నో విపత్తులను తట్టుకున్న ఈ భవనం భారీ వర్షాల ధాటికి కుప్పకూలిందని స్థానికులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా లద్ధాఖ్‌లో పురాతన ఇళ్లు చాలా దెబ్బతిన్నాయని.. గత చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచిన భవనాలు నేలకూలడం వేదనకు గురి చేసిందని స్థానికులు తెలిపారు. గతంలో కంటే ఈ ఏడాది భారీగా వర్షపాతం నమోదైందని.. చాలా ఇళ్లలోకి వరద పోటెత్తిందని వాపోయారు. 2010లోనూ భారీ వర్షాలు కురిసినా ఇంత నష్టం జరగలేదని ఈసారి ఎప్పుడూ చూడని నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. లద్దాఖ్‌లో 24 గంటల పాటు రెడ్ అలర్ట్ జారీ చేశారు. జమ్ముకశ్మీర్‌లో భారీ వర్షాల కారణంగా జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిని మూసేశారు.