Heavy Rain at Bhadradri Temple : భద్రాద్రిలో ఎడతెరిపి లేని వర్షం.. తగ్గిన భక్తజనం - భద్రాద్రిలో వర్ష సూచన
Heavy Rain in bhadrachalam : వానాకాలం ప్రారంభం అయి నెల దాటినా.. వరుణ దేవుడు మోస్తరు వర్షాలతోనే సరిపెడుతున్నాడు. అప్పుడప్పుడు భారీ వర్షాలు పడుతున్నా.. అవి కొన్ని ప్రాంతాలకే పరిమితం అవుతున్నాయి. వర్షాలను నమ్ముకని పంటలు వేసిన రైతన్నలు.. వరుణుడి రాక కోసం వేయి కళ్లతో వేచిచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నేడు భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచే వాతావరణం చల్లగా ఉండగా.. ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వాన పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రిలో ఉదయం సుమారు 2 గంటల పాటు ఏకధాటిగా వర్షం కురిసింది. ఎడతెరిపి లేని వర్షంతో రామయ్య సన్నిధిలోని బేడా మండపంలో నిర్వహించాల్సిన నిత్య కల్యాణ మహోత్సవాన్ని ప్రాకార మండపంలో జరిపారు. భారీ వర్షానికి ఆలయ పరిసరాలు సహా భద్రాద్రిలోని ప్రాంతాలన్నీ తడిసి ముద్దయ్యాయి. ఉదయం పూట బడికెళ్లే విద్యార్థులు, పనుల కోసం బయటకు వచ్చిన వారు ఇబ్బందిపడ్డారు. ఇదిలా ఉండగా.. వర్షం కారణంగా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ తగ్గింది.