సైకిల్‌పైనే వృద్ధురాలి మృతదేహం తరలింపు.. ఆరోగ్య మంత్రి సొంత జిల్లాలోనే ఇలా! - odisha odisha old woman dead body
ఒడిశాలో హృదయ విదారక ఘటన జరిగింది. చికిత్స పొందుతూ మృతి చెందిన వృద్ధురాలి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు ఆసుపత్రిలో అంబులెన్స్‌లు కరవయ్యాయి. దీంతో హాస్పిటల్ సిబ్బంది ప్రవర్తనతో విసిగిపోయిన వృద్ధురాలి గ్రామస్థులు.. మృతదేహాన్ని సైకిల్‌పై తీసుకెళ్లారు. ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సొంత జిల్లాలో ఈ ఘటన జరగడం విచారకరం.
అసలు కథేంటంటే?
సుబర్ణపుర్ జిల్లాలోని మెఘ్లా గ్రామానికి చెందిన రుక్మిణి సాహు అనే వృద్ధురాలు శుక్రవారం మధ్యాహ్నం వడదెబ్బతో అస్వస్థతకు గురైంది. అదే గ్రామంలో ఉండే రుక్మిణి దూరపు బంధువు ఒకరు ఆమెను బినికా గోస్తి హెల్త్ సెంటర్లో చేర్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వృద్ధురాలు మరణించింది. వైద్యులు మరణ ధ్రువీకరణ పత్రం ఇచ్చి.. మృతదేహాన్ని తీసుకెళ్లమని తెలిపారు. అయితే రుక్మిణికి తన వారంటూ లేకపోవడం వల్ల మృతదేహాన్ని తీసుకెళ్లడానికి ఎవరూ రాలేదు. చాలా సేపు మృతదేహం ఆసుపత్రిలోనే ఉంది.
సమాచారం అందుకున్న గ్రామస్థులు ఆస్పత్రికి చేరుకొని.. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అంబులెన్స్ కావాల్సిందిగా అక్కడ సిబ్బందిని కోరారు. కానీ ఎవరూ స్పందించకపోవడం వల్ల విసుగెత్తిపోయిన గ్రామస్థులు.. స్థానికుల సహాయంతో వృద్ధురాలి మృతదేహాన్ని తెల్లటి గుడ్డలో చుట్టారు. ఆస్పత్రి వార్డు లోపల నుంచే సైకిల్‌పై మృతదేహాన్ని తీసుకెళ్లారు. అక్కడే ఉన్న ఆసుపత్రి సిబ్బంది ఒక్కరు కూడా స్పందించకపోవడం గమానార్హం.