హరియాణాలో టెన్షన్ టెన్షన్.. అనేక కార్లు ధ్వంసం.. కర్ఫ్యూ అమలు - హరియాణాలో అలర్లు
రెండు వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణలతో హరియాణాలోని నూహ్‌లో ఉద్రిక్తత నెలకొంది. వందలాది వాహనాలను ధ్వంసం చేశారు ఆందోళనకారులు. నూహ్ జిల్లాకు ఆనుకొని ఉన్న గురుగ్రామ్ ఇతర జిల్లాలపైనా ఈ ఘర్షణల ప్రభావం పడింది. రంగంలోకి దిగిన ప్రభుత్వం జిల్లాలో కర్ఫ్యూను విధించింది. వీటి ప్రభావం రెవాఢీ, గురుగ్రామ్, ఫరీదాబాద్, పల్వాల్ జిల్లాలకు వ్యాపించింది. పాఠశాలలకు సెలవులు ప్రకటించి.. పరీక్షలను వాయిదా వేసింది. ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య ఐదుకు చేరింది. ఇందులో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు. అనేక మంది పోలీసులు గాయపడ్డారు. వదంతుల వ్యాప్తిని అడ్డుకునేందుకు బుధవారం అర్ధరాత్రి వరకు నూహ్ జిల్లాలో మొబైల్ ఫోన్లలో అంతర్జాల సేవల్ని నిషేధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు 20 కంపెనీల కేంద్ర బలగాలను పంపించాలని కేంద్రాన్ని కోరింది హరియాణా ప్రభుత్వం. దీనికి స్పందించిన కేంద్ర హోంశాఖ.. 15 కంపెనీల కేంద్ర బలగాల్ని హరియాణాకు తరలిస్తున్నామని తెలిపింది.
ఓ మతపరమైన ర్యాలీని అడ్డుకునేందుకు మరో వర్గంవారు ప్రయత్నించడం వల్ల ఈ వివాదం తలెత్తింది. దీంతో రెండు వర్గాల ప్రజలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు కృషి చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకుందామని తెలిపారు.