మారువేషంలో సీఎం- ముఖానికి మాస్క్, తలకు టోపీ- సెక్యూరిటీ లేకుండా ప్రజల మధ్యే - పంచకులా మేళాలో హరియాణా సీఎం
Published : Nov 9, 2023, 8:23 AM IST
|Updated : Nov 9, 2023, 10:34 AM IST
Haryana CM Viral Video : సాధారణ పౌరుడిలా జనాల మధ్య హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. ఎవరూ గుర్తుపట్టకుండా ముఖానికి మాస్క్, తలకు టోపీ పెట్టుకుని ప్రజల మధ్య సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తిరిగారు. ఈ వీడియో చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు.
పంచ్కులాలోని సెక్టార్-5లోని ఓ గ్రౌండ్లో జరుగుతున్న మేళాకు మంగళవారం సాయంత్రం సీఎం ఖట్టర్ మారువేషంలో సామాన్య వ్యక్తిలా వచ్చారు. ఈ మేళాకు లక్షలమంది వస్తారు. ఈ మేళాలోనే.. ముఖ్యమంత్రి ఎటువంటి సెక్యూరిటీ లేకుండా కాసేపు ప్రజల మధ్య తిరిగారు. ఎవరూ గుర్తుపట్టకుండా మాస్క్ పెట్టుకుని, తలకు టోపీ ధరించి, తువ్వాలు చుట్టుకుని ఆ మేళాలో అటూ ఇటూ తిరిగారు. ఆ ప్రదేశంలో కొంచెం సేపు ఫోన్ చూసుకుంటూ నిలబడ్డారు. అనంతరం సీఎం ఖట్టర్.. ఓ స్టాల్లో పాప్కార్న్ కొనుగోలు చేసి ఆ ప్రాంతమంతా తిరిగారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.