Harish Rao on 2023 Assembly Elections : 'మరోసారి ఆశీర్వదిస్తే.. మరింత ఉత్సాహంతో పనిచేస్తాం' - 2023 ఎన్నికలపై మంత్రి హరీశ్‌రావు కామెంట్స్
Harishrao Zaheerabad Tour Today : గృహలక్ష్మి పథకం కింద రూ.3 లక్షల ఆర్థిక సాయాన్ని నేరుగా లబ్దిదారుల ఖాతాలో జమ చేస్తామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పునరుద్ఘాటించారు. ఇందుకోసం ఎవరికీ లంచాలు ఇవ్వవలసిన అవసరం లేదన్నారు. పేదల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఆత్మ బంధువులా పని చేస్తున్నారని వ్యాఖానించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్ రావుతో కలిసి మంత్రి పద్మశాలి, ఆరె కటిక ఆత్మ గౌరవ భవనాల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా అన్ని వర్గాల అభివృద్ధి కోసం పని చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లోనూ ఆశీర్వదిస్తే.. మరింత ఉత్సాహంతో పని చేస్తామని మంత్రి పేర్కొన్నారు. ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తుకొచ్చే పార్టీలు.. రాష్ట్రాన్ని దశాబ్దాలుగా పాలించి ఎందుకు అభివృద్ధి చేయలేదో చెప్పాలని ప్రశ్నించారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇంటింటికీ స్వచ్ఛమైన తాగు నీరు, సాగు నీరు, రహదారులు, గురుకులాలు ఎందుకు ఏర్పాటు చేయలేదని నిలదీశారు.
ఈ క్రమంలోనే రాష్ట్రంలో ప్రజల ఆదరాభిమానాలతో పాలన సాగిస్తున్న ప్రభుత్వం.. హైదరాబాద్‌తో పాటు జహీరాబాద్ లాంటి పట్టణంలోనూ ఆత్మ గౌరవ భవనాలు నిర్మిస్తోందని గుర్తు చేశారు. రాష్ట్రంలో పుట్టబోయే ప్రతి బిడ్డ.. ఆరోగ్యంగా, బలంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆరు లక్షల మందికి న్యూట్రిషన్ కిట్ల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ఈ నెల 16న పథకాన్ని ప్రారంభించి.. ప్రతి గర్భిణీకి రెండుసార్లు పోషకాహార కిట్‌ను పంపిణీ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.