Harish Rao Tweet : 'నాడు ఎండిన చెరువులు.. నేడు నిండుకుండలు' - Harish Rao Twitter Latest News
Harish Rao Tweet on Mission kakatiya : దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు ఊరూరా చెరువుల పండుగను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో డప్పులు చపుళ్లతో బోనమెత్తుకుని బయల్దేరి.. బతుకమ్మ ఆడుతూ.. అంగరంగ వైభవంగా వేడుకలు జరుపుతున్నారు. రైతులు, మహిళలు, మత్య్సకారులు ఇలా అన్ని వర్గాల వారు ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. చెరువు కట్టలపై సభలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మిషన్ కాకతీయతో చెరువులకు పునరుజ్జీవం వచ్చిందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.
గత పాలకుల వైఫల్యంతో ఎండిన చెరువులు.. నేడు నిండు కుండల్లా కళకళలాడుతున్నాయని హరీశ్‌రావు వివరించారు. నాటి పాలకుల నిర్లక్ష్యం వల్ల గొలుసుకట్టు వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన మిషన్ కాకతీయ చెరువులకు కొత్త కళ తెచ్చిందని కితాబిచ్చారు. మరోవైపు మిషన్ కాకతీయ దేశానికే ఆదర్శంగా నిలిచిందని వెల్లడించారు. అమృత్ సరోవర్‌గా దేశవ్యాప్తంగా మిషన్ కాకతీయ అమలవుతోందని చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆచరించిందే.. దేశం అనుసరిస్తోందంటూ హరీశ్ రావు ట్వీట్ చేశారు.