Harish Rao on Haritha Haram : 'దేశంలోనే 7.4 శాతం గ్రీన్ కవర్ పెంచిన ఏకైక రాష్ట్రం.. మన తెలంగాణ'
Harish Rao on Telangana Harithaharam :ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో ప్రజల ఆరోగ్య రక్షణ కోసం హరితహారం చేపట్టడం జరిగిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. దేశంలోనే 7.4 శాతం గ్రీన్ కవర్ పెంచిన ఏకైక రాష్ట్రం.. తెలంగాణ రాష్ట్రమని మంత్రి పేర్కొన్నారు. సిద్దిపేటలో 20 వేల మొక్కలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. హరితహారంలో భాగంగా సిద్దిపేట మున్సిపల్ కార్యాలయం వద్ద ఇంటింటికీ 5 మొక్కల పంపిణీ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొని మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిద్దిపేటను ఆకుపచ్చ, హరిత సిద్దిపేటగా మార్చుకున్నామని మంత్రి తెలిపారు. సిద్దిపేటలో ఉచితంగా నచ్చిన పండ్ల మొక్కలను ఇంటింటికీ అందజేస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ దూరదృష్టి వల్ల ఈ కార్యక్రమం సాధ్యమైందని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 14,864 నర్సరీలు, 19,072 పల్లె ప్రకృతి వనాలు అభివృద్ధి చేశామని వెల్లడించారు. 13.44 లక్షల ఎకరాల్లో రాష్ట్రవ్యాప్తంగా 273 కోట్ల మొక్కలు నాటించామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వంటి నిజమైన పర్యావరణవేత్తకు మాత్రమే ఇది సాధ్యమవుతుందని కొనియాడారు. నేడు తెలంగాణ ఏం చేస్తుందో.. దేశం అదే అనుసరిస్తోందని పునరుద్ఘాటించారు.