Harish Rao Fires on BJP Leaders : 'కేసీఆర్ పట్టుబట్టి కాళేశ్వరం కడితే.. బీజేపీ తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తుంది' - భాజపా ఎంపీలు పార్లమెంటు సాక్షిగా అబద్ధాలు
Harish Rao Fires on BJP Leaders : ఎవరు ఔనన్నా.. కాదన్నా హ్యాట్రిక్ కొట్టేది బీఆర్ఎస్.. మూడోసారి ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్ అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో నియోజకవర్గానికి చెందిన 360 మందికి బీసీ బంధు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగదేవ్‌పూర్, వర్గల్ మండలాలకు చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అనంతరం మాట్లాడిన హరీశ్‌రావు.. బీజేపీ ఎంపీలు పార్లమెంటులో కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.85 వేల కోట్లు ఇచ్చామని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రూ.85 వేల కోట్లు కాదు కదా.. రూ.85 పైసలు కూడా ఇవ్వకుండా ప్రాజెక్టు నిర్మాణానికి అడుగడుగునా మోకాలు అడ్డుపెట్టి ప్రాజెక్టును ఆపాలని చూశారని దుయ్యబట్టారు. కేసీఆర్ పట్టుబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేస్తే.. బీజెేపీ వాళ్లు అది కూడా వాళ్ల ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారన్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో బీజెేపీకి బలం లేదు.. కాంగ్రెస్ పార్టీకి క్యాండెట్లు లేరు.. మన బీఆర్ఎస్కు తిరుగు లేదన్నారు. బీజెేపీ, కాంగ్రెస్ పార్టీలకు కర్రు కాల్చి వాత పెట్టి కేసీఆర్‌కు పట్టం కట్టాలని కోరారు.