కాంగ్రెస్‌కు ఓటు వేస్తే మూడు గంటల కరెంటును అనుమతించినట్లే : హరీశ్‌రావు - తెలంగాణ ఎన్నికల ప్రచారాలు
Published : Nov 15, 2023, 7:09 PM IST
Harish Rao Election Campaign in Medak: బీఆర్ఎస్ మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ కాపీ కొడుతుందని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. రేపు (ఈ నెల 16న) మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొననున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో సభా ప్రాంగణం, హెలిప్యాడ్, వేదికను మంత్రి హరీశ్‌రావుతో పాటు ఎమ్మెల్యే మదన్ రెడ్డి, ప్రస్తుత బీఆర్ఎస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి పరిశీలించారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే మూడు గంటల కరెంటును అనుమతించినట్లేనని హరీశ్‌రావు పేర్కొన్నారు. రైతులు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మోసపోవద్దని సూచించారు. భారీ ఎత్తున యువత, రైతులు పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు.
కాళేశ్వరం అంటే మేడిగడ్డ బ్యారేజీ ఒక్కటే కాదని.. రెండు పిల్లర్లు కుంగితే కాళేశ్వరమే కుంగినట్లు విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. దీని విషయంలో తప్పులు జరిగినప్పటికీ.. ప్రభుత్వం లోపాలను సవరించినట్లు చెప్పారు. భవిష్యత్తులో జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేస్తామన్నారు. కేసీఆర్ సర్కార్ చేసిన అభివృద్ధి, సంక్షేమం ప్రజల ముందు ఉందని.. తప్పకుండా కేసీఆర్ మూడోసారి సీఎం అవుతారని హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు.