Harish Rao Distributed Podu Pattas : 'అడవి బిడ్డలను అన్నదాతలుగా మార్చిన ఘనత కేసీఆర్‌దే' - podu lands in khammam
Minister Harish Rao Participated Podu Pattas Distribution : అడవి బిడ్డలను అన్నదాతలుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. పోడు పట్టాలు అందుకున్న గిరిజన బిడ్డలకు ఇక నుంచి అటవీ అధికారుల వేధింపులు ఉండవని మంత్రి భరోసా ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో పోడు భూములకు సంబంధించిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లబ్ధిదారులకు ఇచ్చిన పోడు పట్టాలతో రాయితీలు లభిస్తాయని తెలిపారు. పాస్ బుక్ లభించిన వారికి క్రాప్ లోన్ వస్తుందని తెలిపారు.
ఆ భూములు పొందిన వారికి జులై 1 నుంచి ఉచిత విద్యుత్ వస్తుందని ప్రకటించారు. గిరిజనుల సంక్షేమం కోసం కేసీఆర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. గిరిజనుల ఇళ్లలోని బాధలు చూసి.. వాటిని నివారించేందుకు కల్యాణలక్ష్మి పథకం రాష్ట్రంలో అమలు చేశారని చెప్పారు. ఇటీవల అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారం వస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని అర్హులకు పట్టాలను అందించారు. ఈ క్రమంలోనే జాన పద కళాకారులతో కలిసి సాయిచంద్‌కు నివాళిగా జాన పద గీతాన్ని మంత్రి పువ్వాడ పాడారు.