హనుమాన్ జయంతి స్పెషల్.. నైవేద్యంగా టన్ను బరువున్న లడ్డూ.. ఎక్కడంటే?
మధ్యప్రదేశ్‌లో హనుమంతుడికి భారీ లడ్డూను నైవేద్యంగా సమర్పించనున్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఈ భారీ లడ్డూను తయారుచేశారు. జబల్పుర్లో ఉన్న పురాతన పంచమాతా హనుమంతుని ఆలయంలో నైవేద్యం కోసం టన్ను బరువున్న లడ్డూను తయారుచేశారు. మహిళలే ప్రత్యేకంగా ఈ లడ్డూను తయారుచేయడం విశేషం. నిపుణులైన చెఫ్‌ల సహాయంతో టన్ను బరువున్న భారీ లడ్డూను వారు తయారుచేశారు. ఆంజనేయుడికి నైవేద్యంగా లడ్డూను సమర్పించే సంప్రదాయాన్ని గతేడాది జబల్పుర్ వాసులు ప్రారంభించారు. గతసారి నగరంలోని యువకుల లడ్డూ ప్రసాదాన్ని తయారుచేశారు. ఈ ఏడాది మహిళలు చొరవ తీసుకుని కేవలం 7 రోజుల్లోనే.. 4 అడుగుల ఎత్తైన లడ్డూను సిద్ధం చేశారు. లడ్డూ బరువు అధికంగా ఉన్నందున దాని కింద మందపాటి ప్లాస్టిక్ షీట్‌ను ఏర్పాటు చేశారు. అర్చకులు వేద మంత్రాలతో లడ్డూకు పూజలు నిర్వహించారు. ఏప్రిల్ 6న హనుమాన్ జయంతి సందర్భంగా వేద మంత్రాలతో ఆంజనేయుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి లడ్డూను నైవేద్యంగా సమర్పిస్తారు ఆలయ అర్చకులు. అదే రోజున పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు ఏర్పాట్లుచేసి.. ప్రత్యేక లడ్డూలను భక్తులకు పంపిణీ చేస్తారు. అయితే, ఈ పంచమాతా దేవాలయాన్ని చాలా సంవత్సరాల క్రితం గోండు రాజులు నిర్మించినట్లు ఇక్కడి వారు చెబుతున్నారు.