హనుమాన్ జయంతి స్పెషల్.. 16 కోట్ల సార్లు 'రామ' నామ జపం.. ప్రతి ఒక్కరూ లక్షకుపైగా! - హనుమంతుడి లేటెస్ట్ న్యూస్
దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున హనుమాన్ జయంతి ఉత్సవాలను భక్తులు ఘనంగా జరుపుకున్నారు. అయితే ఉత్తరాఖండ్లో వినూత్నంగా అంజన్న జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించారు భక్తులు. ఈ కార్యక్రమంలో 16 కోట్ల సార్లు హనుమంతుడికి ఎంతో ఇష్టమైన హరి నామ జపం చేశారు. ఈ మహోత్తర కార్యక్రమంలో 1,600 మంది భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి భక్తుడు లక్ష సార్లు హరి నామం జపం చేశారు. అయితే ఈ దైవ నామస్మరణ చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పేర్లు నమోదు చేసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
నైనితాల్ జిల్లాలోని హల్ద్వానీ ప్రాంతంలో ఉన్న శ్రీనిత్యానంద పాధ్ గౌ ధామ్ ఆశ్రమంలోని భారీ హనుమంతుడి విగ్రహం ముందు ఈ వేడుక నిర్వహించారు. ఉత్తరాఖండ్లో ఆంజనేయ స్వామి జయంతి రోజు ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ఇదే మొదటి సారి అని ఆశ్రమం డైరెక్టర్ శ్రీ రామేశ్వర్ దాస్ ప్రభు జీ మహారాజ్ చెలిపారు. ప్రతీ భక్తుడు మెడలో పూలదండలు వేసుకుని మరి.. 'జై శ్రీరామ్', 'హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే' అంటూ నామాన్ని జపించినట్లు ఆయన వెల్లడించారు. ప్రజాసంక్షేమం, లోకకల్యాణం, లోకశాంతి కోసం సమష్టిగా ఈ హరి నామ జప కార్యక్రమాన్ని నిర్వహించామని ఆశ్రమం డైరెక్టర్ వెల్లడించారు. హరి నామాన్ని జపించేందుకు ఉత్తరాఖండ్ నుంచే కాకుండా ఉత్తర్ప్రదేశ్ నుంచి కూడా భక్తులు హాజరయ్యారని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు.