సిరా చుక్క వేలికి కాదు కాలికి - అంగవైకల్యమున్నా ఓటేసిన దివ్యాంగులు
Published : Nov 30, 2023, 4:31 PM IST
Handicapped People Voted with Leg : ఓటు వేయడాన్ని చాలామంది పెద్ద విషయంగా పరిగణించరు. అది ఓ బాధ్యతగా భావించరు. ఆఫీసులకు సెలవులిచ్చినా.. ఓటు వేయడానికి బద్ధకిస్తుంటారు. ఓటు విలువ ఏంటో తెలిసినా కూడా అంతే. ఎన్నో రకాలుగా అవగాహన కల్పించినా పట్టించుకోని వాళ్లు ఎంతోమంది సమాజంలో ఉన్నారు. కానీ ఇద్దరు దివ్యాంగులు.. రెండు చేతులు లేనప్పటికీ కాలుతో ఓటు వేసి ప్రజాస్వామ్య పరిరక్షణలో తనవంతు పాత్ర పోషించి అబ్బురపరిచారు.
కరీంనగర్‌కి చెందిన అరుణ్ అనే దివ్యాంగుడు రెండుచేతులు లేకపోయినా.. పోలింగ్ కేంద్రానికి వచ్చి మరీ ఓటుహక్కు వినియోగించుకున్నాడు. చిన్నతనంలోనే విద్యుత్‌షాక్ గురై రెండు చేతులు పోగొట్టుకున్న అరుణ్ 18వ యేటా నుంచి క్రమం తప్పకుండా వినియోగించుకుంటున్నారు. ప్రొసీడింగ్ అధికారి కాలివేలికి చుక్కపెట్టి ఓటు హక్కు పత్రాలు అందించారు. కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌కి చెందిన జాకీర్ పాషా పుట్టుకతోనే దివ్యాంగుడు. రెండుచేతులు లేకపోయినా అధైర్యపడకుండా ముందడుగువేస్తున్నాడు. దైనందిన జీవితంలో సాధారణపనులన్నీ కాళ్లతోనే చేసుకుంటున్నాడు. ఎన్నికల్లో తనవంతు బాధ్యతగా పాల్గొని కాలితో ఓటు వేసి అందరికీ ఆదర్శంగా నిలిచాడు.