హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయిస్తాం: గువ్వల బాలరాజు - High Court verdict on MLAs poaching case
ఎమ్మెల్యేలకు ఎర కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని.. తమ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీలను జేబు సంస్థలుగా వాడుతోందని ఆరోపించారు. విచారణ సంస్థలతో తమను ఇబ్బంది పెట్టాలని కేంద్రం చూస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ సర్కారును కూల్చే కుట్ర ఎవరు చేశారో అందరికీ తెలిసిందేనని వివరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమను ఇబ్బంది పెడితే సహించేది లేదని గువ్వల బాలరాజు హెచ్చరించారు.
అంతకు ముందు కేసును సీబీఐకి అప్పగించొద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. సీబీఐకి అప్పగిస్తూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును తప్పుబట్టలేమని.. అందులో జోక్యం చేసుకోలేమని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. మరోవైపు హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉందని.. తీర్పును 15 రోజుల పాటు అమలు చేయకుండా చూడాలని సీజే ధర్మాసనాన్ని అడ్వకేట్ జనరల్ కోరారు. అయితే దానికి న్యాయస్థానం నిరాకరించింది. ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐకి బదిలీ చేయాలని గతంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయసేన్‌రెడ్డి తీర్పు ఇచ్చారు. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్‌కు అప్పీలు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.తుకారాం ధర్మాసనం అప్పీలుపై సుదీర్ఘ విచారణ జరిపి తీర్పును రిజర్వు చేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ తాజాగా తీర్పు వెలువరించింది.