Gutta Sukhender Reddy Latest Comments : 'రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డిలకు వ్యవసాయం అంటే ఏమిటో తెలుసా?' - తెలంగాణ న్యూస్
Gutta Sukhender Reddy fire on Revanth Reddy : ముఖ్యమంత్రి కేసీఆర్‌పై 24 గంటల ఉచిత కరెంట్ విషయంలో అవినీతి జరుగుతున్నదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డిలకు వ్యవసాయం అంటే ఏమిటో తెలుసా అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఎప్పుడు రైతులకు అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. తొమ్మిదేళ్లలో ఎప్పుడైనా పంట పొలాలు నీరు లేకుండా ఉన్నాయా? అని ప్రశ్నించారు. కరెంట్ కొనుగోలు విషయంలో కుంభకోణం జరుగుతున్నదని.. రేవంత్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని పేర్కొన్నారు. విద్యుత్‌ను ప్రభుత్వరంగ సంస్థ ఎన్ఎల్డీసీ ద్వారా తీసుకుంటున్నామని.. మరి కుంభకోణం ఎలా అవుతుందని నిలదీశారు. యాదాద్రి పవర్ ప్లాంట్‌కు కేంద్రం అనుమతులు ఇవ్వడం లేదని.. బీహెచ్ఈఎల్ ద్వారానే నిర్మిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రాష్ట్రం నాశనం అవుతుందని ధ్వజమెత్తారు. బషీర్ బాగ్ కాల్పులకి కేసీఆర్ కారణం అంటున్న రేవంత్ రెడ్డి మాటల్లో నిజం లేదని అన్నారు. ఆ సమయంలో రేవంత్ ఎక్కడ ఉన్నారో తెలియదని అన్నారు.