సీఎం కేసీఆర్ లక్ష్యంగా - బీజేపీ, కాంగ్రెస్ పార్టీల కేంద్ర నాయకుల దండయాత్ర : గుత్తా సుఖేందర్ రెడ్డి - బీఆర్ఎస్ ప్రచారం
Published : Nov 26, 2023, 12:43 PM IST
Gutha Sukender Reddy Fires on Opposition Parties : : బీజేపీ, కాంగ్రెస్ పార్టీల కేంద్ర నాయకులు కేసీఆర్ను లక్ష్యంగా చేసుకుని దండయాత్ర చేస్తున్నట్టుగా కనిపిస్తుందని గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. నల్గొండలోని తన నివాసంలో మాట్లాడిన గుత్తా.. రెండు పార్టీలు రాష్ట్రంపై అధికారం చెలాయించడం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని అన్నారు. ప్రధాని మోదీ తెలంగాణలోని ప్రజల మధ్య కులాలు, మతాల చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రధాని జాతీయ దృక్పథంతో ఉండాలి కానీ.. కులాల కుమ్ములాటలు ప్రోత్సహించడం సరికాదన్నారు.
కాంగ్రెస్ జాతీయ నాయకులు తెలంగాణపై దండయాత్ర చేస్తున్నారన్న ఆయన.. ఆచరణకు సాధ్యం కాని పథకాలను అమలు చేస్తామని అబద్ధాలు చెపుతున్నారని అన్నారు. కొంతమంది కాంగ్రెస్ నాయకులు కావాలనే తనపై సోషల్ మీడియాలో విచ్చలవిడిగా పార్టీ మారుతున్నట్లు వైరల్ చేస్తున్నారని వాపోయారు. తన రాజకీయ జీవితంలో ఏనాడూ ఎవరిపైనా కుట్రలు చేయలేదని.. ఇది మంచి పద్దతి కాదన్నారు. రాబోయే ఎన్నికల్లో నల్గొండ జిల్లాలో పన్నెండు స్థానాలకు పన్నెండు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.