ఇన్‌స్టా ఫాలోవర్ల కోసం యువకుల డబ్బుల వర్షం.. ఆ వెబ్‌సిరీస్ ప్రేరణతోనే.. - hariyana youth latest news
హరియాణాలో యువకులు పాపులారిటీ కోసం వింత చేష్టలకు పాల్పడ్డారు. కారులో నుంచి కరెన్సీ నోట్ల విసురుతూ వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. షాహిద్ కపూర్ నటించిన ఫర్జీ వెబ్ సిరీస్‌ను ప్రేరణగా తీసుకొని కారులోంచి డబ్బులను బయటకు విసిరారు గురుగ్రామ్‌కు చెందిన ఇద్దరు యువకులు. సామాజిక మాధ్యమాల్లో పాపులర్ అవ్వాలని, తమ వీడియోలకు ఎక్కువ వ్యూస్ రావాలనే ఉద్దేశంతో డబ్బులు విసిరారు.
ఈ వీడియో పోలీసులు దృష్టికి రాగా.. వారు యువకులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. అప్పుడు ఆ యువకులు ఎందుకలా చేశారో తెలిసింది. ఈ యువకులు ఎలాగైనా ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫాలోవర్లను పెంచుకోవాలనుకున్నారు. ఇన్‌స్టా ద్వారా డబ్బులను సంపాదించాలనుకున్నారు. చిన్న చిన్న వీడియోలను పోస్ట్ చేస్తూ ఉన్నారు. ఫాలోవర్లు పెరిగితే ప్రకటనలు వస్తాయని.. దాని ద్వారా డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో కొత్తగా ఏదో వీడియో చేయాలని నిర్ణయించుకున్నారు. ఆరోజు జోరావర్ సింగ్ అనే వ్యక్తి వేగంగా కారును నడుపుతుండగా గురుప్రీత్ సింగ్ డిక్కీలో కూర్చుని డబ్బులను బయటకి విసిరాడు. కబీర్, హార్దిక్ అనే ఇద్దరు వ్యక్తులు బైక్‌పై నుంచి వీరిని వీడియో తీశారు. అయితే ఆ వీడియో పాపులర్ అయ్యి పోలీసులు దృష్టికి వెళ్లింది. దీంతో కారు నంబర్ ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకున్నారు.