అమ్మమ్మ ఇంట్లో నెల రోజుల కొడుకు.. చూసేందుకు వెళ్తుండగా ఘోరం.. అక్కడికక్కడే తండ్రి మృతి
గుజరాత్‌లోని వడోదరలో స్కూటీని తప్పించబోయి నేరుగా డివైడర్‌ను ఢీకొట్టాడు ఓ బైకర్. ఈ ఘటనలో బైకర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కరేలీబాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దీపికా గార్డెన్ సమీపంలో ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడిని రాజేశ్ భాయ్ సోలంకి(26)గా పోలీసులు గుర్తించారు. అతడు వడోదరలోని జవహర్ పలియా ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. రాజేశ్ భాయ్ ప్రతాప్‌నగర్‌లోని ఓ ప్రైవేటు స్కూల్లో స్వీపర్‌గా పనిచేస్తున్నాడు. నెల రోజుల క్రితమే రాజేశ్‌కు కుమారుడు పుట్టాడు. అప్పటి నుంచి రాజేశ్ భార్య.. ఆమె పుట్టింట్లోనే ఉంటుంది. గురువారం వారిని చూసేందుకు రాజేశ్ వెళుతుండగా ప్రమాదం జరిగింది. ఘటనలో రాజేశ్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో రాజేశ్ తలకు హెల్మెట్ ధరించలేదని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఘటనకు కారణమైన స్కూటీ డ్రైవర్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.