Nikhat Zareen : గోల్డెన్ గర్ల్ నిఖత్‌కు హైదరాబాద్‌లో ఘనస్వాగతం - Golden girl Nikhat zareen
World Boxing Championship winner Nikhat Zareen : ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించటమే లక్ష్యంగా సాధన చేస్తానని ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ విజేత, భారత బాక్సర్ నిఖత్ జరీన్ మరోసారి స్పష్టం చేసింది. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్లో గోల్డ్ మెడల్ సాధించిన నిఖత్ జరీన్‌కు హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు.
ప్రపంచ ఛాంపియన్ షిప్లో గోల్డ్ మెడల్ సాధించటం ఆనందంగా ఉందని నిఖత్ చెప్పింది. అందుకు సహకరించిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు రుణపడి ఉంటానని పేర్కొంది. ప్రభుత్వం అందజేసిన ప్రోత్సాహంతోనే విశ్వవేదికపై సత్తాచాటినట్లు తెలిపింది. భవిష్యత్తులో ఒలింపిక్స్‌లో బంగారు మెడల్ సాధిస్తానని ధీమా వ్యక్తం చేసింది.
అనంతరం మాట్లాడిన మంత్రి శ్రీనివాస్ గౌడ్.. ప్రపంచ ఛాంపియన్ షిప్లో గోల్డ్ మెడల్ సాధించిన తెలంగాణ ఆడపడుచు నిఖత్ జరీన్ దేశానికే గర్వకారణమని కొనియాడారు. విద్యార్థులు, ఒగ్గు కళాకారుల విన్యాసాలతో ఎయిర్ పోర్ట్ ప్రాంగణం సందడిగా మారింది.