అయోధ్య సీతమ్మకు సిరిసిల్ల బంగారు చీర - ఖరీదెంతో తెలుసా? - అయోధ్యకు గోల్డెన్ చీర
Published : Jan 18, 2024, 9:55 PM IST
Golden Saree to Ayodhya Ram Mandir: అయోధ్య శ్రీరామచంద్రుడి పాదాల చెంత సిరిసిల్ల నుంచి బంగారు చీర(Golden Saree)ను సమర్పించనున్నారు. సిరిసిల్ల నేతన్న వెల్ది హరిప్రసాద్ నేసిన బంగారు చీరను ఈనెల 26న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అందించనున్నారు. ప్రధాని చేతుల మీదుగా రాముడి పాదాల చెంత చీరను ఉంచనున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సిరిసిల్లలోని హరిప్రసాద్ నివాసానికి వెళ్లి, బంగారు చీరను పరిశీలించారు. శ్రీరాముడి చిత్రంతో పాటు రామాయణ ఇతివృత్తాన్ని తెలియజేసే చిత్రాలను సైతం ఆ చీరలో పొందుపర్చడం విశేషం.
Textile Artist Make Golden Saree to Ayodhya: చీరను తయారు చేసేందుకు 8 గ్రాముల బంగారం, 20 గ్రాముల వెండితో దాదాపు 20 రోజులు పట్టిందని హరిప్రసాద్ చెప్పారు. సుమారు రూ.1.50 లక్షలు ఖర్చు అయిందని తెలిపాడు. చీర అందరినీ అబ్బురపరిచేలా ఉందని బండి సంజయ్ కుమార్ తెలిపారు. అనంతరం తయారీదారున్ని అద్బుతంగా మలిచినందుకు అభినందించారు. గతంలో అగ్గిపెట్టెలో చీరెను ఇమిడే విధంగా చీరను తయారు చేసిన చరిత్ర సిరిసిల్ల జిల్లాదేనని గుర్తు చేశారు. ఇంతటి గొప్ప నైపుణ్యాన్ని సొంతం చేసుకున్న చేనేత రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. చేనేత కార్మికులను ఆదుకునేందుకు తన వంతు కృషి చేస్తానని బండి సంజయ్ భరోసా ఇచ్చారు.