Gold Sweet Gujarat : స్వీట్స్‌పై బంగారు పూత.. కేజీ రూ.11 వేలు.. దేశవిదేశాల్లోనూ ఫుల్ డిమాండ్ గురూ! - బంగారు ఘరీ స్వీట్
Published : Oct 25, 2023, 8:13 AM IST
Gold Sweet Gujarat : సాధారణంగా ఒక కేజీ స్వీట్ ధర సుమారు రూ. 700 నుంచి రూ.1000 వరకు ఉండొచ్చు. అయితే గుజరాత్‌లోని ఓ కేజీ స్వీట్ మాత్రం కిలో ధర అక్షరాల రూ.11 వేలు పలుకుతోంది. చండీ పడ్వా పండుగ సందర్భంగా సూరత్‌లో తయారయ్యే ఈ స్పెషల్ స్వీట్‌కు ఎంతో డిమాండ్ ఉంది. అయితే ఈ ఘరీ స్వీట్‌ను అత్యంత నాణ్యమైన ఎండు ఫలాలు, స్వచ్ఛమైన నెయ్యి, బంగారు రేకును ఉపయోగించి తయారు చేస్తారు. 15 రోజుల వరకు పాడవకుండా ఉండటం ఈ ఘరీ ప్రత్యేకత.
సూరత్‌లోని ప్రసిద్ధ మిఠాయి సంస్థలు మాత్రమే తయారు చేసే ఈ ఘరీని వంద గ్రాముల ముక్కలుగా చేసి అందంగా తీర్చిదిద్దుతారు. 24 కేరట్ల బంగారు పూతతో కూడిన గోల్డెన్ ఘరీకి సూరత్‌లోనే కాకుండా దేశమంతా మంచి డిమాండ్ ఉంది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి బంగారు ఘరీ కోసం ముందస్తు ఆర్డర్లు వచ్చాయని దుకాణదారులు తెలుపుతున్నారు. ఆర్డర్లకు అనుగుణంగా స్వీట్లను విదేశాలకు కూడా ఎగుమతి చేస్తామని షాపు యజమానులు వివరించారు. కార్పొరేట్ సంస్థలు, పెద్ద పెద్ద వ్యాపారులు పండగల సమయంలోనూ, ఇతర సందర్భాల్లోనూ బహుమతులుగా ఇచ్చేందుకు బంగారు ఘరీని పెద్దఎత్తున కొనుగోలు చేస్తుంటారని స్వీట్ దుకాణం యజమాని చెప్పారు.