గోల్డెన్ టెంపుల్ గణేశుడికి రూ.8 కోట్ల బంగారు కిరీటం.. ఎంత ముచ్చటగా ఉందో! - శ్రీపురం గోల్డెన్ టెంపుల్ నిర్మాణానికైన ఖర్చు
Gold Crowning Lord Ganesh Idol : తమిళనాడు వెల్లూర్‌లోని ప్రసిద్ధ శ్రీపురం గోల్డెన్ టెంపుల్లోని శ్రీశక్తి గణపతి శిరస్సుపై అరుదైన కిరీటాన్ని అలంకరించారు. నవరత్నాల్లో ఒకటైన సైమోఫేన్ అనే రత్నాన్ని బంగారు కిరీటంలో పొదిగారు. ఆ సైమోఫేన్ 880 క్యారెట్లున్న ఒకే రత్నం కావడం విశేషం. ఆ సైమోఫేన్ ధర 8 కోట్ల రూపాయల వరకు ఉంటుందని దేవస్థానం బోర్డు తెలిపింది. ప్రజలు ప్రశాంతంగా, ఆరోగ్యంగా జీవించాలని వినాయకుడికి కోరుకున్నామని పేర్కొంది.
శ్రీపురంలోని గోల్డెన్ టెంపుల్ నక్షత్రాకారంలో ఉంటుంది. ఈ ఆలయం బంగారం రంగులో మెరిసిపోతుంది. ఆలయ మధ్య గోపురాన్ని తిరుపతి తిరుమల దేవస్థానం స్వర్ణకారులు బంగారంతో నిర్మించారు. ఈ గోల్డెన్ టెంపుల్ నిర్మాణానికి రూ.600 కోట్లు ఖర్చు అయినట్లు తెలుస్తోంది. 1,500 కిలోల బంగారాన్ని ఆలయ కట్టడంలో వినియోగించారని సమాచారం. ఈ గోల్డెన్ టెంపుల్ ప్రాంగణంలోనే.. 1,700 కిలోల వెండితో తయారుచేసిన శక్తి వినాయకుడి విగ్రహన్ని 2021లో ప్రతిష్ఠించారు. తెల్లటి రంగులో ఈ విగ్రహం ఉంటుంది.