Goddess Decoration With Rs.1 Crore : 1,11,11,111 ఇది ఫ్యాన్సీ నంబర్ కాదండోయ్.. అమ్మవారి అలంకరణకు వాడిన నోట్ల విలువ - గద్వాల దసరా వేడుకలు
Published : Oct 21, 2023, 4:32 PM IST
Goddess Decoration With Rs.1 Crore at Jogulamba Gadwal : దేవీశరన్నవరాత్రులను పురస్కరించుకొని అమ్మవారిని రోజుకో రూపంలో ప్రత్యేకంగా అలంకరిస్తారు. పండ్లు, కాయగూరలు, గాజులు, పుష్పాలు.. వివిధ రకాలుగా అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ క్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం.. రాజవీధిలో వెలసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి నోట్లతో కనువిందు చేసే అలంకరణతో తీర్చిదిద్దారు. ఏకంగా కోటి రూపాయల నోట్లను వాడి అమ్మవారిని, ఆలయ మండపాన్ని ముస్తాబు చేశారు.
దసరా ఉత్సవాలలో ఆరో రోజైన శుక్రవారం నాడు అమ్మవారు.. ధనలక్ష్మీ దేవి అలంకరణలో దర్శనం ఇచ్చారు. మొత్తంగా ఈ అలంకరణ కోసం రూ.కోటి 11లక్షల 11వేల 111 వాడినట్లు నిర్వాహకులు తెలిపారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఇది తక్కువ మొత్తం అని అన్నారు. 2022 సంవత్సరంలో రూ.5 కోట్లతో ధనలక్ష్మీ దేవి అలంకారం చేయడం జరిగిందని.. ఈసారి ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న కారణంగా తక్కువ మొత్తంలో అలంకరణ చేసినట్లు ఆలయ నిర్వాహకులు వివరించారు.