Godavari Water Level Today : భద్రాచలం వద్ద పెరుగుతున్న నీటిమట్టం.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
Godavari Water Level At Bhadrachalam :రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ నుంచి వస్తున్న వరదతో.. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. నిన్న సాయంత్రం 30 అడుగుల వద్ద ఉన్న గోదావరి నీటిమట్టం.. ప్రస్తుతం 43 అడుగులు దాటి ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దించి.. ముందస్తు చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే గోదావరి నీటిమట్టం 43 అడుగులు దాటడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గోదావరి నుంచి 9 లక్షల 32 వేల 228 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు కలెక్టర్ డా.ప్రియాంక అలా తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరుతున్నందున భద్రాచలం వద్ద నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్ర జల వనరుల శాఖ అధికారులు వెల్లడించారు.
వరద నీరు పెరగడంతో.. భద్రాచలం స్నానఘట్టాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. దమ్ముగూడెం మండలం పర్ణశాల వద్ద నది ప్రవాహం ఉద్ధృతంగా పెరుగుతోంది. సీతమ్మ నార చీరల ప్రాంతం వరదలో చిక్కుకుంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతున్నందున లోతట్టు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రియాంక అలా పేర్కొన్నారు. ముంపునకు గురయ్యే గ్రామాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.