Third Danger Alert at Godavari : ఉగ్రరూపం దాల్చుతున్న గోదావరి.. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరికలు జారీ
Godavari Present Water Level : గత వారం రోజులుగా కురుస్తోన్న కుండపోత వర్షాలకు తోడు ఎగువ నుంచి వస్తోన్న వరద ప్రవాహంతో గోదావరి నది ఉగ్రరూపం దాల్చుతోంది. దీంతో నదీ పరివాహక ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను చేతిలో పెట్టుకొని కాలం గడుపుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో గోదావరి వరద నీరు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. శుక్రవారం రాత్రి 9 గంటల సమయానికి గోదావరి నీటిమట్టం 53.1 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
ఇదే చివరి ప్రమాద హెచ్చరికగా అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం 14,32,336 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. రాత్రి 10 గంటల సమయానికి నీటి మట్టం 53.2 అడుగులకు చేరింది. గోదావరి నీటిమట్టం 56 నుంచి 58 అడుగులకు చేరే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ ప్రియాంక పేర్కొన్నారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. గోదావరి వరద ఉద్ధృతికి తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ ప్రధాన రహదారిపైకి నీరు వచ్చింది. దీంతో తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.