Girls Gurukul College Problems in Mahabubnagar : శిథిలావస్థకు చేరిన గురుకులం.. బిక్కుబిక్కుమంటూ చదువులు సాగిస్తున్న విద్యార్థినులు - తెలంగాణ న్యూస్
Girls Gurukul College Problems in Mahabubnagar : మహబూబ్నగర్ జిల్లాలోని బాలనగర్ మండలం కేంద్రంలో 40 సంవత్సరాల క్రితం నిర్మించిన బాలికల గురుకులం శిథిలావస్థకు చేరింది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని విద్యార్థినిలు ఆందోళన చెందుతున్నారు. ఈ పాఠశాలలో అన్ని తరగతి గదులు పూర్తిగా దెబ్బతిన్నాయి. వర్షం కురిస్తే.. గదులన్నీ పైకప్పు నుంచి నీరు కారుతుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. గురుకులంలో 650 మంది విద్యార్థినులు చదువుతున్నారు. 80 మందికి సరిపోయే వసతి గృహంలో 160 మందికి పైగా సర్దుకుపోవాల్సి వస్తోందని విద్యార్థినిలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వసతి, వంటశాల, భోజనాల గదుల్లో దశాబ్దం క్రితం ఏర్పాటు చేసిన స్విచ్ బోర్డులు పూర్తిగా పాడయ్యాయని.. 10 రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి గోడలు షాక్ కొడుతున్నాయని.. విద్యార్థినిలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
650 మంది విద్యార్థినిలు ఉన్న పాఠశాల, కళాశాలలో వీరికి సరిపడా నీరు అందడం లేదని ఆరోపించారు. సదరు అధికారులు ఒక బోరుబావిని తవ్వించాలని పాఠశాల ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఈ గురుకులంలో అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉందని.. కేవలం అతిథి అధ్యాపకులతోనే తరగతులు నెట్టుకొస్తున్నామని తెలిపారు. గురుకులానికి సొంతంగా విద్యుత్తు నియంత్రికను ఏర్పాటు చేయాలని.. 2010 సంవత్సరంలో రూ.3 లక్షల డీడీ చెల్లించినా మంజూరు చేయలేదని ప్రిన్సిపల్ కృష్ణమూర్తి తెలిపారు. కొత్త వసతి గదుల నిర్మాణానికి ఈడబ్లూఐడీసి ద్వారా రూ.40 లక్షలు మంజూరైనట్లు అధికారులు చెబుతున్నా.. నిధులు విడుదల కాలేదని వెల్లడించారు.