వీధి కుక్కల దాడిలో.. బాలికకు తీవ్రగాయాలు - మెదక్లో వీధి కుక్కల దాడి
Dogs Attacked A Girl In Medak: రాష్ట్రవ్యాప్తంగా వీధికుక్కల దాడులలో.. గాయపడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే వస్తోంది. తాజాగా మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ 6వ వార్డులో బాలికపై వీధికుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో బాలికకు తల, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు ఏంటా శబ్ధం అని చేసే సరికి.. బాలిక రక్తపుమడుగులో పడి ఉన్న చిన్నారిని స్థానిక నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెెళ్లి చికిత్స అందించారు. గాయం పెద్దది కావడంతో హైదరాబాద్లోని నారాయణగూడ కోరంటి ఆసుపత్రికి తరలించారు. ఈ కుక్కల దాడి ఘటన మొత్తం దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది.
వివరాల్లోకి వెళితే.. నర్సాపూర్ మున్సిపాలిటీలోని 6వ వార్డులో ఆలీ సాజ్ తన కుటుంబంతో నివాసం ఉంటున్నారు. తన ఏడు సంవత్సరాల కుమార్తె ఇంటి దగ్గర నుంచి బయటకు వస్తున్న క్రమంలో ఒక్కసారిగా రెండు కుక్కలు దాడికి పాల్పడ్డాయి. వెంటనే చిన్నారి అరవడంతో.. అక్కడే ఉన్న స్థానికులు వచ్చి కుక్కలను దూరంగా తరిమివేసి.. రక్తపు మడుగులో ఉన్న తనను ఆసుపత్రికి తరలించారు. పట్టణంలో ఒకవైపు కోతులు.. మరోవైపు వీధికుక్కల దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని స్థానికులు వాపోయారు. ఇప్పటికైనా ఈ సమస్యలపై చర్యలు తీసుకోవాలని పట్టణ వాసులు కోరుతున్నారు.