Ganesh Navratri Celebrations 2023 in Hyderabad : మండపాల ఏర్పాటు, అలంకరణలో తగ్గేదే లే అంటున్న నిర్వాహకులు.. ఆకట్టుకుంటున్న గణనాథులు
Published : Sep 22, 2023, 7:29 PM IST
Ganesh Navratri Celebrations 2023 in Hyderabad : హైదరాబాద్ నగరంలో ప్రతి ఏటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే గణేశ్ నవరాత్రి ఉత్సవాలు(Ganesh Navratri Celebrations) అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. భాగ్యనగర వ్యాప్తంగా మండపాలను అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. వివిధ మండపాలలో విభిన్న రూపాల్లో కొలువుదీరిన విఘ్నేశ్వరుడు.. భక్తుల విశేష పూజలు అందుకుంటున్నాడు. మండపాల్లో నిర్వాహకులు ప్రత్యేక పూజలు, హోమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. మండపాలు రంగురంగుల విద్యుత్ ఎల్ఈడీ దీపాల వెలుగులతో కాంతులీనుతున్నాయి. వివిధ ఆకృతుల్లో ఏర్పాటు చేసిన మండపాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కరోనా నేపథ్యంలో గత రెండేళ్ల పాటు సాదాసీదాగా జరిగిన గణేశ్ ఉత్సవాలు.. ప్రస్తుతం అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఈ ఏడాది వినాయక చవితికి ముందే వినాయక విగ్రహాలను ఆగమనం పేరిట వైభవంగా మండపాలకు తరలించి.. కొత్త ట్రెండ్‌ను సెట్ చేశారు. మండపాల ఏర్పాటు, అలంకరణలో ఖర్చుకు ఏమాత్రం తగ్గేదే లే అన్నట్లుగా నిర్వాహకులు వ్యవహరిస్తున్నారు.
Hyderabad Ganesh Nimajjanam 2023 :మరోవైపు వినాయక నిమజ్జనోత్సవాలు భక్తుల కోలాహలం మధ్యన కొనసాగుతున్నాయి. వినాయక చవితి నుంచి పూజలందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నాడు. పాతబస్తీ సహా అన్ని ప్రధాన ప్రాంతాల నుంచి వినాయక విగ్రహాలను భక్తులు పెద్దఎత్తున ఊరేగింపు మధ్య ట్యాంక్‌బండ్‌కు తరలిస్తున్నారు. అలాగే పోలీసులు ముందు జాగ్రత్తగా ట్యాంక్‌బండ్ పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లు చేశారు.