Gandhi Jayanti 2023 : 'ప్రపంచవ్యాప్తంగా గాంధీ ప్రభావం'.. మహాత్మునికి రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ నివాళులు - గాంధీజీకి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నివాళి
Published : Oct 2, 2023, 10:21 AM IST
Gandhi Jayanti 2023 Pm Modi Tribute : గాంధీ జయంతి సందర్భంగా దిల్లీలోని రాజ్‌ఘాట్‌లో మహాత్ముడికి ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. గాంధీ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉందన్న మోదీ.. అది సమస్త మానవాళిని ఐక్యంగా కరుణతో జీవించేలా ప్రేరేపిస్తుందని చెప్పారు. మహాత్ముడి కాలాతీతమైన బోధనలు మన మార్గంలో ప్రకాశాన్ని వెదజల్లుతూనే ఉన్నాయన్నారు. మనందరం ఆ మహానుభావుడి కలలు నెరవేర్చేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఆయన ఆలోచనలు ప్రతి యువకుడిని మార్పునకు కారకునిగా చేసి.. ఐక్యత, సామరస్యాన్ని పెంపొందించగలవు అన్నారు.
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ స్పీకర్ జగదీప్ ధన్‌ఖడ్, కేంద్రమంత్రులు, దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఎల్‌జీ సక్సేనా కూడా గాంధీకి నివాళులు అర్పించారు. తెల్లవారుజామున కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే రాజ్‌ఘాట్ వద్ద గాంధీకి నివాళులర్పించారు.
గాంధీజీ ఆలోచనలు దేశం కోసమే : రాష్ట్రపతి
మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో ఆయన సేవలను స్మరించుకున్నారు. గాంధీజీ ఆలోచనలు, సందేశాలు.. పనులు అన్ని దేశం కోసమే సాగాయని రాష్ట్రపతి ద్రౌపదిముర్ము అన్నారు. రాజ్‌ఘాట్ వద్ద గాంధీజీకి రాష్ట్రపతి నివాళులు అర్పించారు. రాజ్‌ఘాట్ వద్ద మహత్మాగాంధీకి నివాళులు అర్పించిన ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్.. స్వాతంత్ర్య పోరాటానికి మార్గ నిర్దేశనం గాంధీ సూత్రాలను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు.
పోరుబందర్లో..
గాంధీ జన్మస్థలం పోరుబందర్‌లోని కీర్తి మందిర్‌లో గుజరాత్ ముఖ్యంత్రి భూపేంద్ర పటేల్ మహాత్మునికి నివాళులు అర్పించారు.
లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి..
స్వతంత్ర భారత రెండో ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయనకు విజయ్‌ఘాట్‌లో నివాళులు అర్పించారు ప్రధాని మోదీ. జై జవాన్ జై కిసాన్ నివాదం ప్రస్తుత తరాలకు ప్రేరణగా ఉందని చెప్పారు.