Gampa Govardhan Reacted on KCR Contest from Kamareddy : 'కామారెడ్డి స్థానం నుంచి కేసీఆర్ పోటీ..! క్లారిటీ ఇదిగో..!! - Telangana Latest News
Gampa Govardhan Reacted on KCR Contest from Kamareddy : రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తారని ప్రచారం జోరుగా సాగుతున్న వేళ.. వాటికి బలం చేకూర్చుతూ ప్రభుత్వ విప్ గంప గోవర్దన్ కీలక వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలోని రాజంపేట మండలం ఆరేపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఆయన.. అనంతరం ప్రసంగించారు. ఈ సందర్భంగా కామారెడ్డి అసెంబ్లీ స్థానం(Kamareddy Assembly Constituency) నుంచి పోటీ చేయాలని కేసీఆర్‌ను ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయడానికి సీఎం కేసీఆర్ ఇక్కడి నుంచి పోటీ చేయాలని కోరినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే ఏ ఎమ్మెల్యే అయినా సిట్టింగ్ స్థానాన్ని వదులుకోరని.. నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను అందుకు సిద్ధపడ్డానని వివరించారు. కేసీఆర్ ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే.. తాను కార్యకర్తగా పని చేస్తానని వ్యాఖ్యానించారు. అనంతరం కామారెడ్డితో సీఎం కేసీఆర్‌కు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. సీఎం తల్లిదండ్రులు రాఘవరావు, వెంకటమ్మ కేసీఆర్ బాల్యంలో బీబీపేట మండలం కోనాపూర్‌లో నివసించారని.. ఎగువ మానేరు నిర్మాణ సమయంలో సాగు భూములు ముంపునకు గురవడంతో సిద్దిపేట మండలం చింతమడకకు వలస వెళ్లారని తెలిపారు. అయినా సీఎం కేసీఆర్ ఇప్పటికీ కోనాపూర్‌ను తమ సొంత గ్రామంగానే భావిస్తుంటారని చెప్పారు.