సీఎం, ప్రతిపక్ష నేత ఆత్మీయ కలయిక.. ఎయిర్పోర్ట్లో భుజాలు తట్టుకుంటూ.. - సీఎం బసవరాజు బొమ్మై సిద్ధరామయ్య వీడియో
మరికొద్ది రోజుల్లో కర్ణాటకలో అసెంబ్లీ ఓట్ల పండుగ జరగనుంది. అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంలో మునిగిపోయాయి. ప్రముఖ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ మరింత దూకుడుగా ఎన్నికల ప్రచారాలను నిర్వహిస్తున్నాయి. ఇందుకోసం జాతీయ స్థాయి నేతలను కూడా రంగంలోకి దింపుతున్నాయి పలు పార్టీలు. ఇదిలా ఉంటే ఎన్నికల నేపథ్యంలో బెళగావి జిల్లాలోని విమానాశ్రయంలో ఇద్దరు ముఖ్యమైన నేతలు మధ్య ఓ ఆసక్తికర సన్నివేశం కనిపించింది. సరదాగా కలుసుకున్న వీరి దృశ్యాలు ప్రస్తుతం కెమెరాకు చిక్కాయి. ఆ వీడియోలో ఉంది మరెవరో కాదు.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, కాంగ్రెస్ ప్రతిపక్ష నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య. వీరిద్దరు ఎయిర్పోర్ట్లో స్నేహపూర్వకంగా కలుసుకున్నారు. ఈ క్రమంలో సిద్ధరామయ్య సరదాగా నవ్వుతూ బొమ్మై భుజంపై తట్టారు. అనంతరం ముందుకు సాగుతున్న క్రమంలో సిద్ధరామయ్య భుజాలపై కూడా బొమ్మై అప్యాయంగా చేయి వేసి మాట్లాడారు. ఇద్దరూ పరస్పరం కరచాలనం చేసుకున్నారు. వీరితో పాటు ఎమ్మెల్యే అనిలా బెనకే, మాజీ ఎమ్మెల్యే ఫిరోజ్ సేఠ్, సంజయ్ పాటిల్ రాష్ట్రానికి సంబంధించిన పలువురు ముఖ్యనేతలు కూడా కనిపించారు. ఎప్పుడూ ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఓటర్ల దృష్టిని ఆకర్షించే నేతలు ఒకే వేదికపై ఇలా నప్వుకుంటూ గడపడం అందరి దృష్టిని ఆకర్షించింది. అందుకే వీరికి సంబంధించిన ఈ వీడియోను సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారింది.