food distribution in Mulugu Floods : వాగుల ఉద్ధృతి రాకపోకలు బంద్..హెలికాప్టర్ ద్వారా ఆహార పొట్లాల పంపిణీ.. - ములుగు న్యూస్
Mulugu Floods 2023 :ములుగు జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఆయా గ్రామాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఏటూరునాగారం మండలం ఏజెన్సీ గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకునే ఉన్నాయి. జంపన్న వాగు ఉద్ధృతికి కొండాయి, మల్యాల, దొడ్ల గ్రామాలను నీళ్లు చుట్టుముట్టాయి. శుక్రవారం సాయంత్రం నుంచి వర్షం తగ్గినప్పటికీ కూడా మూడు గ్రామాల్లో ఇళ్లు నీటిలోనే ఉన్నాయి. గిరిజనులు గ్రామపంచాయతీ భవనం, స్థానిక ఆశ్రమం, పాఠశాల భవనం ఎక్కి ఉండి బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
హెలికాప్టర్ ద్వారా భోజనం, వాటర్ బాటిళ్లు మందులు పంపిణీ చేశారు..గురువారం ఉదయం నుంచి ఇబ్బందులు పడుతున్న గ్రామస్థులకు గిరిజన యువత పెద్ద కవర్ పట్టుకోవడంతో హెలికాప్టర్ నుండి ఆహార సంచులను కిందకు వేశారు. పోలీసులు వెళ్లేవరకూ వారికి ఏమీ తినేందుకు లేవు. సాయం కోసం దీనంగా ఉండిపోవాల్సిన పరిస్ధితి. ఎన్.డి.ఆర్.ఎఫ్ బృందం చేరుకుని గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.